Wednesday, November 10, 2010


ఆగిపోకుసుమీ!,నీవు అపజయానికి భయపడి .
వీడిపోకుసుమీ!,నీవు కర్తవ్యం ముడివీడి.
జారిపోకుసుమీ!,నీవు అడుగులేయ తడబడి.
దూసుకుపోసుమీ! నీవు శరమువలె వడివడి.

Friday, February 12, 2010

నవ్వు

నవ్వు,
నీ ఆనందాన్ని లోకంపై వెదజల్లు,
నవ్వించు,
నీ ఆ సంతోషాన్నందరికీ పంచు.

నవ్వుతూ నవ్వించు,
నవ్విస్తూ నవ్వు.

నవ్వు ,
నీలో పెంచును ఉత్సాహం,
కలిగించును ఉల్లాసం,
ఇచ్చును ప్రోత్సాహం ,
చేయకు తాత్సారం.

నవ్వు,
సుగంధాలు వెదజల్లే పువ్వు,
నవ్వు,
లేకుంతే వ్యర్థం నువ్వు.

నవ్వులు,
హాయిగ ఎగిరే ఖగములు,
ఎత్తైన హిమగిరి నగములు.

నవ్వితే నువు నవాబువి,
లేకుంటే మరి గరీబువి.

నవ్వితె పోయెదేముంది,
నవ్వకుంటె పోయేదుంది.

అందుకే మరి...నవ్వు ...నువ్వు.

Wednesday, April 22, 2009

తెలుగువారి సంవత్సరాది,
వెలుగునింపెడి ఉగాది.
కావాలి భవితకు పునాది,
అవ్వాలి వెతలకు విరోధి...
నవనవోన్మేషంగా,దిగ్దిగంతాలకు మన తెలుగువారి కీర్తి వ్యాపించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
ఈ నవ్య ఉగాది మనలోని దివ్యత్వాన్ని బయటకు తెస్తుందని ఆశిస్తూ...
తెలుగువానిగా పుట్టిన ఓ భారతీయుడు..

Friday, February 6, 2009

అమ్మ

ఈ విచిత్ర జగత్తునకు స్వాగతం పలికే ఆదిద్వారం అమ్మ,

ఆనందంలో,ఆవేదనలో అర్ధభాగం అమ్మ,

కోరినది ఇచ్చి కోర్కెలను తీర్చు కల్పతరువు అమ్మ,

అద్రి అంతటి ఉన్నతము,అంబుధి యంతటి విశాల మనస్సుగల అనంతురాలు అమ్మ,

విధుని కౌముదివంటి స్వచ్ఛమైన మదిని గల్గినది అమ్మ,

విశ్వమనెడి అఱదమునకు ఇరుసువంటిది అమ్మ,

ప్రళయంలోకూడా ప్రకోపించని ప్రశాంతవదని అమ్మ,

దేవదేవుళ్ళకు సైతం ఆపదలో దొడ్డదిక్కు అమ్మ,

ఈ విశ్వమనెడి క్రీడాప్రాంగణమునకు కవాటములు తెఱచు తొలి తాళపుచెవి అమ్మ ,

ఏడు వింతలను మైమరపించు ప్రేమను కురిపించే ఎనిమిదవ వింత అమ్మ,

ఈ లోకమునందుండే అత్యంత పవిత్రమూ,ఉచ్చారణా సౌలభ్యమైన పదము అమ్మ...

Tuesday, February 3, 2009

నల్లని కలువ వికసిస్తుంది,
వెన్నెల వెలుతురులో చందమామతో స్నేహంకోరి.
మయూరం పురివిప్పి నర్తిస్తుంది ,
కారు మేఘాలతోడ వచ్చిన వాన
చినుకులతో స్నేహంకోరి.
కాల చక్రం గిఱ్ఱున తిరుగుతూ ఉంటుంది,
గత తరాలను వదలి ముందు తరాల వారితో స్నేహంకోరి.
నా హృదయం పరితపిస్తూనే ఉంటుంది,
నీవంటి మృదు మధురమైన వ్యక్తితో
స్నేహంకోరి….

మారణహోమం

హృది హృదినీ కదిలించే,
మది మదినీ పలికించే,
యెద యెదనీ రగిలించే,
దారుణ మారణహోమం,
ఆగాలీ ఇకనైనను,
జరుగరాదు ముందు ముందు,
నడుం కట్టు,ఉడుంపట్టు,
జెండానే చేతపట్టు,
క్రుశించాలి,నశించాలి,
క్రుళ్ళి,క్రుళ్ళి చావాలీ
దారుణ మారణహోమం.
విషం క్రక్కె మతం వద్దు,
ఫగలు సెగలు అసలు వద్దు,
హిందువైన ,ముస్లిమైన,
క్రైస్తవైన,సిక్కుయైన
మనదంతా ఒకే జాతి,
పోదాం మనం ఒకే రీతి,

కలిసుంటే లేదు భీతి,
దక్కును బోలెడు ఖ్యాతి,
కలదు సుఖం కలదు సుఖం కలిసుంటే,
లేదు సుఖం రాదు జయం విడిపోతే…

2.దిగులెందుకు సోదరా??

దిగులు తెగులు సోకనీకు సోదరా!,
గుండెల్లో గుబులు నీకు వలదురా!,
సరదాగ జీవితాన్ని గడపరా!,
పనిలోన సంతోషం పొందరా!,


ఫలితం నీ చేతిలోన లేదురా!,
అలాగని,
ప్రయత్నాన్ని మానివేయ వద్దురా!,
విధినైనా యెదుర్కొనగ వచ్చురా!,
సంకల్పం ఆయుధంగా సాగరా!,


సాటివారి సేవలోన బ్రతుకుమురా!,
స్వార్థం విడనాడి ముందుకురుకుమురా!,